Sunday 11 November 2012

శాసనసభ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం


  • పార్లమెంట్ తరహా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు

  • స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు స్పీకర్ నిర్ణయం

  • మొత్తం పది కమిటీల ఏర్పాటు

  • ఒక్కో కమిటీలో 35మంది సభ్యులు

  • 25 ఎమ్మెల్యేలు,10 ఎమ్మెల్సీలతో కమిటీ


రాష్ట్రశాసన సభ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. పార్లమెంట్ తరహాలో స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఒక్కోకమిటీలో 35 మంది సభ్యులతో పది స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని స్పీకర్ నిర్ణయించారు. అయితే ఈ కమిటీలు ప్రస్తుతం బడ్జెట్ పైనే దృష్టి సారిస్తాయని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.రాష్ట్రశాసన సభలో కొత్త అధ్యయానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ తరహా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.శాసన సభ కమిటీ హల్‌లో జరిగిన రూల్స్ కమిటీ మీటింగ్‌లో వివిధ పార్టీల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీల విధి విధానాలపై చర్చ జరిగింది. మొత్తం పది కమిటీలు ఏర్పాటు చేయాలని స్పీకర్ నిర్ణయించగా, వీటిల్లో ఒక్కోదానిలో మొత్తం 35 మంది సభ్యులుంటారు. ఇందులో పాతికమంది మంది ఎమ్మెల్యేలు.. పదిమంది ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు.

అయితే పది కమిటీలను శాఖల వారీగా చూస్తే 1. విద్యా, క్రీడలు.. 2. పురపాలక, గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్... 3. సంక్షేమం...4.నీటిపారుదల 5. వైద్య, ఆరోగ్యం... 6.హోం, రవాణా... 7.వ్యవసాయం, పశుసంవర్దక.. 8.రెవెన్యూ, వాణిజ్యం... 9.పరిశ్రమలు, ఐటీ...10. అటవీ, పర్యాటకశాఖలు ఉన్నాయి. అయితే ఈ స్టాండింగ్ కమిటీలు ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలపై మాత్రమే చర్చించే అవకాశాలున్నాయని స్పీకర్ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇకపై బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రెండు వారాల పాటు సభ వాయిదా పడుతుంది. తరువాత ప్రారంభమైన స్టాండింగ్ కమిటీ ఇచ్చే బడ్జెట్‌ రిపోర్ట్‌ను ఆమోదిస్తుంది. అయితే ఈ స్టాండింగ్ కమిటీల సిబ్బంది ఏర్పాటుపై స్పీకర్ మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.